ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ప్రభుత్వ అధికారులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీకి అండగా ఉంటూ విపక్ష పార్టీల నేతలపై కేసులు బనాయించడం పోలీసులకు సాధారణ వ్యవహారంలా మారిందని అన్నారు.ఎంతో మంది బీజేపీ నేతలు, కార్యకర్తలపై కూడా ఎన్నో తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అధికారంలో ఎవరు ఉంటే వారి వైపు మళ్లుతున్నారని విమర్శించారు. పోలీసులు, అధికారులు పద్ధతి మార్చుకోవాలని, బాధ్యతగా వ్యవహరించాలని… లేకపోతే విశ్వసనీయతను కోల్పోతారని అన్నారు.తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేనతో కలసి పోటీ చేస్తామని సోము వీర్రాజు తెలిపారు. ఏ పార్టీ పోటీ చేయాలనేదాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. ఎవరు పోటీ చేసినా మిత్ర ధర్మంతో కలిసి పని చేస్తామని తెలిపారు. తిరుపతిలో తాము గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.