కేసీఆర్ ప్రభుత్వంపై బీఎస్పీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పాలనతో బహుజనులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. మన పిల్లలు చదివే పాఠశాలల్లో 200 మంది విద్యార్థులు ఉంటే… టీచర్ మాత్రం ఒక్కరే ఉంటారని… మనకు ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి? అని ప్రశ్నించారు. మన పిల్లలు చదివే యూనివర్శిటీల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్శిటీలలో రిజర్వేషన్లు లేకుండా చేశారని… దీనిపై ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బంజారా బిడ్డలే అత్యాచారానికి గురవుతున్నారని అన్నారు.
ఎస్సెల్బీసీ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెలా రూ. 4.25 లక్షల జీతం తీసుకుంటున్నారని… పాములు, తేళ్లతో కొట్లాడుతూ కూలి పని చేసుకునే మన గిరిజన బిడ్డలు రూ. 200 మాత్రమే సంపాదిస్తున్నారని అన్నారు. బహుజనులు బాగుపడాలంటే బహుజన రాజ్యమే రావాలని చెప్పారు.