పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో భర్తను చంపేందుకు భార్య వేసిన ప్లాన్ సినిమా స్టోరీని తలపించింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పొలసానిపల్లికి చెందిన రాణి- గోవింద్ గురునాథ్ భార్యాభర్తలు. గురునాథ్ పాల వ్యాపారి కాగా, రాణి కిళ్లీ కొట్టు నిర్వహిస్తోంది. భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం రాణిలో ప్రవేశించింది. ఈ విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తను హత్య చేయాలని రాణి నిర్ణయించింది. ఇందుకోసం గ్రామానికే చెందిన ఎ.ధనలక్ష్మి, శ్రీనివాసరావుల సహకారం కోరింది. అందరూ కలిసి హత్యకు పథక రచన చేశారు. సైనేడ్ ఉపయోగించి చంపేయాలని డిసైడై.. ద్వారకాతిరుమల మండలం జాజులకుంటకు చెందిన గంటా మోజెస్ సహకారంతో సైనెడ్ సంపాదించారు.
సైనెడ్ పనిచేస్తుందో, లేదో తెలుసుకునేందుకు తొలుత కోడిపుంజుపై ప్రయోగించారు. అది తిన్న కోడి వెంటనే రంగుమారి చనిపోయింది. అది తెగులతో చనిపోయిందని గురునాథాన్ని నమ్మించారు. కోడిపుంజుపై జరిపిన ప్రయోగం విజయవంతం కావడంతో ఆదివారం మటన్ వండి అందులో సైనేడ్ కలిపారు. మధ్యాహ్నం భోజనంలో మటన్‌తో ఒక ముద్ద తిన్న గురునాథ్ రుచి తేడాగా ఉండడంతో వదిలేశాడు. తనపై ఏదో కుట్ర జరుగుతోందని అనుమానించి జాగ్రత్త పడ్డాడు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నిన వారంతా ఇంటి ఆవరణలో మాట్లాడుకుంటుండగా రహస్యంగా విని పోలీసులకు సమాచారం అందించాడు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మటన్ కూర, సైనేడ్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.