ముంబైలో ‘కరోనా’ బారిన పడ్డ వారిలో మీడియా ప్రతినిధులు కూడా ఉన్నట్టు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ప్రకటించారు. ఈ నెల 16, 17 తేదీల్లో ప్రత్యేక కరోనా శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ఆజాద్ మైదానంలో నిర్వహించిన ఈ శిబిరానికి 171 మంది మీడియా ప్రతినిధులు రాగా, వారి నుంచి నమూనాలు సేకరించారు. ఇందుకు సంబంధించి తాజాగా వెలువడ్డ జాబితాలో 53 మంది మీడియా ప్రతినిధులకు పాజిటివ్ వచ్చినట్టు బీఎంసీ అధికారులు తెలిపారు.మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే రిపోర్టులో ఎవరికైతే ‘పాజిటివ్’ వచ్చిందో వారికి ‘కరోనా‘ లక్షణాలు లేవు. వీళ్లందరినీ ఐసోలేషన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ యాభై మూడు మంది ఇంతవరకూ ఎవరినైతే కలిశారో వారి వివరాలను సేకరించి వాళ్లను కూడా క్వారంటైన్ కేంద్రానికి తరలించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.