బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ నెలాఖారు నాటికి చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు. దాంతో ఈ సినిమా దసరాకి వస్తుందని అంతా అనుకున్నారు. బాలకృష్ణకి దసరా సెంటిమెంట్ ఎక్కువ. గతంలో దసరాకి వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ సినిమాను కూడా దసరా కానుకగా అభిమానులకు అందించాలని ఆయన అనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ తమ ఆలోచన మార్చుకున్నట్టుగా తెలుస్తోంది.
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా దసరాకి రాకపోవచ్చనే ఉద్దేశంతో ‘ఆచార్య’ .. ‘రాధేశ్యామ్’ .. ‘అఖండ’ ఆ దిశగా అడుగులు వేశాయి. కానీ నిన్న ‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి మేకింగ్ వీడియోను వదిలారు. ఈ వీడియో చివర్లో రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ముందుగా చెప్పినట్టుగానే దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని స్పష్టత ఇచ్చేశారు. దాంతో ఇప్పుడు మిగతా సినిమాలు తమ విడుదల సమయాలను పరిశీలించుకునే పనిలో పడ్డాయి. అలా ‘అఖండ’ సినిమాను వినాయక చవితికి ప్లాన్ చేస్తున్నారనే ఒక టాక్ మాత్రం బలంగానే వినిపిస్తోంది.