అల్లూరి జిల్లా పెదబయలు మండలం సిరిసపల్లి గ్రామానికి చెందిన అంబిరి లావణ్య శనివారం కేజిహెచ్ లో అనారోగ్యంతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. అంబిరి లావణ్య పెదబయలు మండల కేంద్రంలో గల గిరిజన బాలికల ఉన్నత పాఠశాల గర్ల్స్ వన్ లో ఐదవ తరగతి చదువుతుంది. గత నెల 29న లావణ్య అనారోగ్యానికి గురి కావడం, వేసవి సెలవులు కావడంతో గ్రామానికి తరలించారు. అయితే గ్రామానికి తరలించిన మూడు రోజులకే తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో విశాఖ కేజీహెచ్ కు తీసుకువెళ్లినప్పటికీ అక్కడ ఉన్న ఎస్టీ సెల్ సిబ్బంది పట్టించుకోకపోవడం, వైద్యులు మెరుగైన వైద్యం సేవలు అందించకపోవడంతోనే తమ కూతురు ప్రాణాలు విడిచిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు ఎప్పటినుంచి అనారోగ్యంతో ఉందో తమకు తెలుపలేదని ఈ విషయమై వివరణ కోరగా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని అన్నారు. విషయం తెలుసుకున్న గిరిజన సంఘం, సిపిఎం నాయకులు గ్రామాన్ని సందర్శించి విద్యార్థిని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తరచూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మృతి చెందుతుంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని, గిరిజన ఆశ్రమ పాఠశాలలో తక్షణమే హెల్త్ వర్కర్లను నియమించాలని గిరిజన సంఘం, సిపిఎం నాయకులు పృథ్వీరాజ్, సన్నీ బాబు డిమాండ్ చేశారు









