రాజన్న సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట పోలీస్స్టేషన్ ఎస్ఐ సీహెచ్. శ్రీకాంత్ను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ, జోన్–3 డీఐజీ ఇన్చార్జి ఎస్. చంద్రశేఖర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘన, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, అదుపులోకి తీసుకున్న వ్యక్తులపై భౌతిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు
రిపోర్టర్లు శేఖర్, సంపత్లపై ఎస్ఐ శ్రీకాంత్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు ఈ వ్యవహారంలో కీలకంగా మారాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బీ. గీతే ఎస్ఐ శ్రీకాంత్ను విధుల నుంచి తప్పించి, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ (డీఏఆర్) హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేశారు. గంభీరావుపేట పోలీస్స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేశ్ను ఇన్చార్జిగా నియమించారు.
విచారణ నివేదిక ఆధారంగా చర్యలు
ఈ ఘటనపై విచారణ అధికారిగా వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులను నియమించారు. ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా డీఐజీ ఆదేశాలతో ఎస్ఐ శ్రీకాంత్పై సస్పెన్షన్ వేటు పడింది.
సస్పెన్షన్ కాలంలో ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
జర్నలిస్టులపై దాడి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసు శాఖ తీసుకున్న ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై తదుపరి శాఖాపరమైన చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.








