గోదావరిఖని : సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డిని, సీఐటీయూ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం జరుగుతోందని ఆ యూనియన్ ఆర్‌జీ-2 బ్రాంచ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. గుర్తుతెలియని వ్యక్తులు తప్పుడు పోస్టర్లు సృష్టించి వాట్సాప్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని కమిటీ నాయకులు ఆరోపించారు.
ఆదివారం నిర్వహించిన ఆర్‌జీ-2 ఏరియా సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలనే లక్ష్యంతో సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి నాయకత్వంలో ఆమరణ నిరాహార దీక్షలు సహా అనేక ఉద్యమాలు చేపట్టినట్లు వివరించారు.
కార్మికులకు కొత్త క్వార్టర్లు నిర్మించాలా? లేక సొంత ఇంటి పథకం కల్పించాలా? అనే అంశంపై వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు సింగరేణి వ్యాప్తంగా బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. కార్మికుల అభిప్రాయాలను యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రామగుండం ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు సొంతింటి పథకం అమలుపై సమగ్ర వినతిపత్రాలు సమర్పించినట్లు పేర్కొన్నారు.
సీఐటీయూ చేపట్టిన సుదీర్ఘ పోరాటాల నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ అంశంపై ప్రకటన చేయడం కార్మికుల ఉద్యమానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నామని ప్రవీణ్ కుమార్ అన్నారు. అయితే, ఈ పరిణామాలను కొందరు ఇతర యూనియన్ల నాయకులు జీర్ణించుకోలేక సీఐటీయూపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు.
కార్మికులకు ప్రయోజనం చేకూర్చే అంశాలపై ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయడాన్ని ‘అమ్ముడుపోవడం’గా చిత్రీకరించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. సీఐటీయూ కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టుకుందని చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, యూనియన్ ఎదుగుదల, నిజాయితీని సహించలేకే ఇటువంటి ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
తమపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగంగా నిరూపించాలని, ఇందుకోసం ప్రెస్‌మీట్ నిర్వహించి వాస్తవాలను వెల్లడించాలని సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొంటూ, ఈ దుష్ప్రచారంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తప్పుడు పోస్టర్లు రూపొందించిన వారితో పాటు వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న వారిపైనా పరువునష్టం దావా వేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతరం పోరాడుతోందని, సొంతింటి పథకం అమలు కోసం చేస్తున్న ఉద్యమాన్ని కార్మికులు గమనిస్తున్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇటువంటి ఆరోపణలను కార్మికులు నమ్మబోరని, తగిన సమయంలో వారే సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు, ఆర్‌జీ-2 బ్రాంచ్ అధ్యక్షుడు బానోతు వినయ్, ఓసీపీ-3 పిట్ సెక్రటరీ రాంప్రసాద్, వినేష్, సాంబారావు, వకీల్‌పల్లి పిట్ సెక్రటరీ తిరుపతి, రాజశేఖర్, శ్రవణ్, రాజేష్, జగదీష్, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.








