contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దళితుల పై దాడి చేసిన సర్పంచ్ – అరెస్ట్ చేయాలనీ డిమాండ్

మెదక్ : మెదక్ జిల్లా తుప్రాన్ మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి (పీటీ) గ్రామంలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా దళితులపై జరిగిన దాడి ఘటనలో గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్‌తో పాటు అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం. అడివయ్య డిమాండ్ చేశారు.

గురువారం కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం. అడివయ్య, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి. శంకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ. మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ. మహేందర్ రెడ్డి, బ్లూ ఇండియా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూంపల్లి మధు, హైకోర్టు న్యాయవాది దివాకర్ పూలే, బీసీ మేధావుల ఫోరం నాయకుడు పాపని నాగరాజు గౌడ్, అనంత్, జర్నలిస్ట్ నగేష్, బీఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రం తదితరులతో కూడిన ప్రతినిధి బృందం కొనాయిపల్లి గ్రామాన్ని సందర్శించి దాడికి గురైన బాధితులను పరామర్శించింది.

ఈ సందర్భంగా ఎం. అడివయ్య మాట్లాడుతూ, బతుకమ్మ ఉత్సవాల్లో తరతరాలుగా గ్రామ దళితులు డప్పులు వాయించడం ఆనవాయితీగా కొనసాగుతోందని, అదే సంప్రదాయాన్ని ప్రశ్నించినందుకు గ్రామ సర్పంచ్, అతని అనుచరులు లాఠీలు, ఇతర మారణాయుధాలతో దళితులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

దాడి సమయంలో కుల దూషణలకు పాల్పడుతూ దళితులను తీవ్రంగా అవమానించారని, “చంపేయండి, చచ్చే వరకు కొట్టండి” అంటూ సర్పంచ్ ప్రేరేపించాడని బాధితులు తమకు వివరించినట్లు తెలిపారు. తమ పిల్లలను రక్షించాలని వేడుకున్న మహిళలపైనా దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆరోపించారు.

ఒక్కో దళితుడిపై 30 మందికి పైగా దాడి చేసి పలువురికి తీవ్ర గాయాలు చేసినప్పటికీ పోలీసులు వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించకుండా నిందితుల పక్షాన వ్యవహరిస్తున్నారని ప్రతినిధి బృందం విమర్శించింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకుండా, నిందితులకు అనుకూలంగా మరో ఫిర్యాదు రాయించేందుకు ప్రయత్నించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది.

గ్రామ పంచాయతీ కార్మికులపై దాడి జరిగి 72 గంటలు గడిచినా పంచాయతీ కార్యదర్శి స్పందించకపోవడం బాధాకరమని పేర్కొంటూ, కార్మికులకు రక్షణ కల్పించడంలో విఫలమైన కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఈ ఘటనపై వెంటనే స్పందించాలని కోరిన నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌పై పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, గజ్వేల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి తుముకుంట నర్సిరెడ్డి వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

కొనాయిపల్లి దళితులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 22న జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేవీపీఎస్ నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నర్సిములు, ప్రవీణ్, నిరంజన్ దాసు, గురుదాసు, కళ్యాణ్ దాసు, అర్జున్, రేణుక, శ్రావణి, ప్రమీల, నాగమణి, సత్యం, లలిత, హేమలత, అంశమ్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :