contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి సేవలు స్ఫూర్తిదాయకం

కరీంనగర్ : ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ఐఏఎస్, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ అన్నారు. అమరవీరుల సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్ పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అడిషనల్ డీసీపీ వెంకటరమణ దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బంది నామావళిని చదివి వినిపించగా, పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. జిల్లా యంత్రాంగానికి పోలీస్ శాఖ వెన్నెముక వంటిదని, శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు, వారి పిల్లల విద్యాభివృద్ధి, సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, దేశ సమగ్రత, అంతర్గత భద్రత, ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాలు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు అంకితభావంతో సేవలందించడమే వారికి అందించే నిజమైన నివాళి అని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కార్యక్రమం అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అందాల్సిన నష్టపరిహారం, సంక్షేమ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అలాగే పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి 31 వరకు కమిషనరేట్ పరిధిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, వ్యాసరచన, లఘు చిత్రాల పోటీలు, విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :