నోయిడా (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, పలు తాత్కాలిక దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం నోయిడా సెక్టార్-125లో ఏర్పాటు చేసిన టీ, స్నాక్స్ దుకాణాల్లో ప్రారంభమై, క్షణాల్లో సమీపంలోని ఇతర దుకాణాలకు వ్యాపించింది.
సెక్టార్-126 పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఐదు దుకాణాలకు మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసు సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఆరు అగ్నిమాపక వాహనాల సహాయంతో సుదీర్ఘంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదం సమయంలో దట్టమైన నల్లటి పొగ ప్రాంతమంతా వ్యాపించడంతో, ముందు జాగ్రత్త చర్యగా అధికారులు సమీపంలోని రహదారులను తాత్కాలికంగా మూసివేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సహాయక చర్యల సందర్భంగా ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి వివరాలను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఉండటంతో మరిన్ని పేలుళ్లు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు నోయిడా చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ వెల్లడించారు. అలాగే శిథిలాల కింద మరెవరైనా చిక్కుకుని ఉన్నారా అనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








