contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జనగామలో బ్లాస్టింగ్‌ల భయం .. గ్రామస్తుల ఆందోళన

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ సమీపంలోని జనగామ గ్రామంలో జరుగుతున్న బ్లాస్టింగ్‌ల కారణంగా గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బ్లాస్టింగ్‌ల ప్రభావంతో ఇళ్లు కంపించడం, గోడలు, పైకప్పులు దెబ్బతినడం, ఇటుకలు కిందపడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శనివారం గ్రామంలో ఓ మహిళ నీటి కోసం బోరు తవ్విస్తుండగా, బోరు సుమారు మూడు అడుగుల లోతులోనే ఒక్కసారిగా కుంగిపోవడంతో గ్రామంలో మరింత ఆందోళన నెలకొంది. ఈ ఘటనతో గ్రామ ప్రజలు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి జనగామ గ్రామాన్ని సందర్శించి, గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలోని పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆమె, బ్లాస్టింగ్‌ల వల్ల ఇళ్లకు జరుగుతున్న నష్టాన్ని, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పరిశీలించారు. గత కొంతకాలంగా బ్లాస్టింగ్‌ల సమయంలో ఇళ్లు తీవ్రంగా కంపిస్తున్నాయని, గోడలు, పైకప్పులు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా బ్లాస్టింగ్‌లు జరుగుతున్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ముందుగానే ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడం అధికారుల బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల కోసం భూములు సేకరించే సమయంలో గ్రామ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, అయితే ప్రభావిత గ్రామాల అభివృద్ధి, ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదని విమర్శించారు. జనగామ గ్రామంలో డ్రైనేజీ, తాగునీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కూడా తగిన విధంగా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బ్లాస్టింగ్‌ల ప్రభావంపై శాస్త్రీయ, నిష్పక్షపాత సమగ్ర విచారణ చేపట్టి, ఇళ్లు, భూములు, భవనాలపై ఎంత మేర ప్రభావం పడుతోందో నిపుణులతో అధ్యయనం చేయించి, ఆ నివేదికను గ్రామ ప్రజలకు బహిరంగంగా వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు.

అలాగే గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, సురక్షిత ప్రాంతంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని అధికారులను ప్రశ్నించిన ఆమె, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

జనగామ గ్రామ ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని పేర్కొన్న కందుల సంధ్యారాణి, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి బ్లాస్టింగ్‌లకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున మరింత బలమైన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, గుండబోయిన పృథ్వీరాజ్, ఇరుగురాల శివకుమార్, సీమ సుధీర్, జనగామ శివరాం తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :