హైదరాబాద్, బోయిన్పల్లి: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బోయిన్పల్లి చిన్న థోకట్టలోని శ్రీ సంజీవిని ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా శనివారం భక్తులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో మహా నిరాహార దీక్ష నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం వరకు ప్రశాంతంగా కొనసాగింది.
దీక్షలో పాల్గొన్న భక్తులు ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేయవద్దని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు. రోడ్డు విస్తరణ అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ, శ్రీ సంజీవిని ఆంజనేయ స్వామి దేవాలయం స్థానిక ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందని, భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా ఉన్న ఆలయాన్ని తొలగించడం సరికాదని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో ధార్మిక కట్టడాలను తొలగించడం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీక్షలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, భక్తుల సెంటిమెంట్లను గౌరవించి కూల్చివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఆలయ ఉనికిని కాపాడుతూ రోడ్డు విస్తరణ చేపట్టేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
దీక్ష సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. “ఆంజనేయ స్వామి ఆలయాన్ని కాపాడుకుందాం – ధర్మాన్ని రక్షించుకుందాం”, “భక్తుల మనోభావాలను గౌరవించాలి” అంటూ నినాదాలు చేశారు.
కులమతాలకు అతీతంగా మహిళలు, యువకులు, వృద్ధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగియగా, ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని భక్తులు ఆకాంక్షించారు.








