కాకినాడ: స్థానిక ఎల్విన్‌పేట గొల్లవీధిలోని స్వయంభు భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో నేడు (ఆదివారం) రాత్రి 31వ త్రినాథ వ్రత పూజ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లోకకళ్యాణార్థం ఇంటింటా త్రినాథ మేళాలు నిర్వహిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నట్లు వెల్లడించారు.
పీఠంలో ఈ నెల అక్టోబర్ 29 (గురువారం) నాడు 54 మంది చతుర్థి ఉపవాసకులతో 235వ సంకష్టహార చతుర్థి మాసోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక గణపతి పూజలు, వ్రతాలు, ధార్మిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.
అదేవిధంగా నవంబర్ 1 (ఆదివారం) నాడు 96 కలశాలతో త్రిదేవి త్రినాథ మేళా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ మహోత్సవంలో ప్రత్యేక హోమాలు, కలశ పూజలు, సామూహిక ప్రార్థనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ మూడు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని త్రినాథ స్వామి, గణపతి స్వామి ఆశీస్సులు పొందాలని భక్తులకు స్వయంభు భోగి గణపతి పీఠం నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.








