contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. యువతలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పిస్తూ, స్టార్టప్‌లకు ప్రపంచ స్థాయి అవకాశాలు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎక్స్‌ఛేంజ్ (APEX)’ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని వినూత్న ఆవిష్కరణలు, స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప్రదర్శించే ఈ వేదికలో విశేష ప్రతిభ కనబరిచిన ఆరు అంకుర సంస్థలను ప్రత్యేక జ్ఞాపికలతో సత్కరించారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ–2024 కింద ఎంపికైన 31 స్టార్టప్‌లకు తొలి విడతగా రూ.2.11 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆయా సంస్థల ప్రతినిధులకు అప్రూవల్ పత్రాలు, చెక్కులను స్వయంగా అందజేస్తూ ప్రభుత్వం స్టార్టప్‌ల ఎదుగుదలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 25 కీలక రంగాల్లో పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సిమెంట్ వంటి సంప్రదాయ పరిశ్రమల నుంచి క్వాంటం టెక్నాలజీ వరకు విస్తరించేలా సమగ్ర పారిశ్రామిక వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు. స్టీల్, పునరుత్పాదక ఇంధనం, సోలార్ సెల్స్, వేఫర్ తయారీ, ఎయిర్ కండిషనింగ్, ఆక్వా, మెడికల్ డివైజెస్, ఫార్మా, డేటా రంగాల్లో బలమైన పారిశ్రామిక వాతావరణాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు.

పరిశ్రమల విజయానికి సమర్థవంతమైన సరఫరా వ్యవస్థ ఎంతో కీలకమని పేర్కొన్న లోకేశ్, మొబైల్ ఫోన్ తయారీని ఉదాహరణగా తీసుకుంటూ 100 కిలోమీటర్ల పరిధిలోనే విడిభాగాల తయారీ, అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

రాష్ట్రంలో లభించే బీచ్ శాండ్ ఆధారిత రేర్ ఎర్త్ మినరల్స్ వినియోగానికి త్వరలో చర్యలు ప్రారంభిస్తామని, ఈ రంగంలో ప్రపంచ స్థాయి పరిశోధనల కోసం ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థల భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ (SMR) రంగంలో అంతర్జాతీయ స్థాయి నిపుణులను ఆంధ్రప్రదేశ్ నుంచే తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా దేశానికి ఆదర్శమూర్తి అని కొనియాడిన మంత్రి, ఆయన విలువలు, నిజాయతీతో కూడిన వ్యాపార దృక్పథమే తమకు స్ఫూర్తి అని చెప్పారు. అందుకే ఈ ఇన్నోవేషన్ హబ్‌కు రతన్ టాటా పేరు పెట్టామని తెలిపారు. స్పేస్ రంగంలో స్కైరూట్ సంస్థకు 300 ఎకరాల భూమి కేటాయించిన విషయాన్ని గుర్తుచేస్తూ, సముద్ర ఆధారిత డ్రోన్ల తయారీలో ఉన్న సాగర్ డిఫెన్స్ వంటి సంస్థలు ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నాయని అన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు భూమి, పెట్టుబడులు, గ్లోబల్ ఎక్స్‌పోజర్, వెంచర్ క్యాపిటల్ అనుసంధానం వంటి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.

కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అగ్రి-టెక్, మెడ్-టెక్, ప్రెసిషన్ ఇంజనీరింగ్, మహిళా పారిశ్రామికవేత్తల స్టాళ్లను పరిశీలించారు. క్వాంటం కంప్యూటింగ్ విడిభాగాలు, ఏఐ ఆధారిత వాయిస్ కమాండ్ డ్రోన్లు, ఎడ్యుకేషనల్ రోబోట్స్ వంటి సాంకేతిక ఆవిష్కరణలను ఆసక్తిగా వీక్షించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ఎం. సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :