మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని రామలింగారెడ్డి హై మాక్సివిజన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే మరియు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మధుమేహం నివారణ, కంటి ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించే లక్ష్యంతో సుమారు 100 మంది విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ నిర్మల్ నాయక్, వైద్యులు డాక్టర్ హరిత, డాక్టర్ హనీషా ప్రియా, మాచర్ల ప్రముఖ న్యాయవాది కుర్రి సాయి మార్కొండారెడ్డి, మెట్టు గోవింద్ రెడ్డి, మాచర్ల పట్టణ ఎస్సై కత్తి స్వర్ణలత, హాస్పిటల్ ఆర్గనైజర్, క్యాంపు బృందం పాల్గొని ర్యాలీకి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మధుమేహంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ హరిత మాట్లాడుతూ, మధుమేహం కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. షుగర్ వ్యాధిని నివారించేందుకు సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా మధుమేహ బాధితులు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.
అనంతరం డాక్టర్ హనీషా ప్రియా మాట్లాడుతూ, మధుమేహం కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధి అనే అపోహను ప్రజలు విడిచిపెట్టాలని అన్నారు. నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అన్ని వయసుల వారికీ మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య పరీక్షలతో పాటు కంటి పరీక్షలు కూడా చేయించుకోవాలని సూచించారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని వివరించారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థులు, ప్రజల్లో మధుమేహం నివారణ, కంటి సంరక్షణపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు.








