పల్నాడు జిల్లా – మాచర్ల : అక్వాన్ తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మాచర్ల మునిసిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మాచర్ల మునిసిపల్ కమిషనర్ శ్రీ డి. వేణు బాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మాచర్ల మునిసిపల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీడీఓ, పోలీస్, వైద్య ఆరోగ్య, విద్యుత్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తుఫాన్ ముగిసే వరకు అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
📞 9849904027
📞 9849905838
లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన పరిస్థితుల్లో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు తెలిపారు.
అలాగే మురుగు కాల్వలు, డ్రెయిన్లలో పూడిక తొలగించి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, ప్రమాదకరంగా ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిల భవనాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన మందులు, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ శాఖ తుఫాన్ కారణంగా అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసి, అంటువ్యాధులు వ్యాపించకుండా క్లోరినేషన్ చేపట్టాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు జేసీబీలు, ట్రాక్టర్లు, జనరేటర్లు, నీటి మోటార్లు తదితర పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు విజ్ఞప్తి:
తుఫాన్ సమయంలో అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దని, శిథిల భవనాలు, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్లు 9849904027, 9849905838కు సమాచారం అందించాలని మాచర్ల మునిసిపల్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







