హుకుంపేట : అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని దాలిగుమ్మడి గ్రామంలో 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు నిర్మాణాలు చేపడుతున్నారంటూ గిరిజన సంఘం నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హడావుడిని అవకాశంగా మలుచుకుని అక్రమ నిర్మాణాలు వేగవంతం చేస్తున్నారని ఆరోపిస్తూ సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
గిరిజన భూములను పరిరక్షించేందుకు అమల్లో ఉన్న 1/70 చట్టాన్ని బేఖాతరు చేస్తూ గిరిజనేతరులు నిర్మాణాలు కొనసాగించడం చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘించినట్లేనని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నమై ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని నిర్మాణాలను పూర్తి చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నాయకులు ఆరోపించారు. గిరిజనుల భూ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, ఇప్పటివరకు పర్యవేక్షణ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.
గిరిజనుల చట్టబద్ధమైన హక్కులను కాపాడడంలో ప్రభుత్వం, రెవెన్యూ శాఖ, ఐటీడీఏ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలపై తక్షణ విచారణ జరిపి, 1/70 చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేసి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారులు ఇప్పటికైనా స్పందించి దాలిగుమ్మడి గ్రామాన్ని సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని, లేకపోతే గిరిజన హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని గిరిజన సంఘం నాయకులు హెచ్చరించారు.







