తిరుపతి – పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు తమ అనుచరులు, కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడంతో స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికలతో నియోజకవర్గంలో టీడీపీ మరింత బలపడుతుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
చౌడేపల్లి మండలానికి చెందిన సీనియర్ నాయకుడు మునెప్ప, మాజీ ఎంపీపీ రెడ్డి ప్రకాశ్, మాజీ సర్పంచ్ భరత్ వరుణ్ వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీ ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో మధుసూదన్ నాయుడు చురుకైన పాత్ర పోషిస్తుండటంతో పాటు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకత్వానికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని స్పష్టం చేశారు.
అనంతరం సీనియర్ టీడీపీ నాయకుడు ఆవుల రామచంద్రయ్య నివాసంలో పార్టీ కార్యకర్తలతో మధుసూదన్ నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాను పుంగనూరులో ఎగురవేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని, ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.
సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరడం పుంగనూరు నియోజకవర్గంలో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రానున్న ఎన్నికల్లో ఈ చేరికలు పార్టీ విజయానికి బలమైన పునాదిగా నిలుస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








