contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆంధ్రాలో ఉదారంగా పీపీపీ .. అమితంగా అప్పుల ఊబి!

  • జీవో నెం. 1397ను తక్షణమే రద్దు చేయాలి: పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు డిమాండ్

 

కాకినాడ : రాజధాని నిర్మాణ వ్యయాన్ని రూ.1,33,302 కోట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.1397ను తక్షణమే ఉపసంహరించుకోవాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో భారీ అప్పులు చేయడం ద్వారా రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు.

సోమవారం విడుదల చేసిన ప్రకటనలో రమణరాజు మాట్లాడుతూ, 2046 వరకు ఆదాయ వనరులు సమకూర్చుకునే లక్ష్యంతో అధికారుల కమిటీని ఏర్పాటు చేయడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ రుణాలు తీసుకుని ఆ భారం చివరికి ప్రజలపైనే మోపడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.

రాజధాని అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం, పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం, ప్రభుత్వ నిధులను రాయితీల రూపంలో వినియోగించడం వంటి అంశాలు జీవోలో చోటుచేసుకోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ సొంత ఆదాయం పేరుతో ప్రజలపై భవిష్యత్తులో అదనపు ఆర్థిక భారాలు పడే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

ఇప్పటివరకు “సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని” పేరుతో ప్రచారం చేస్తూ 2029 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు 2046 వరకు అప్పులు, ఆదాయ ప్రణాళికలపై దృష్టి పెట్టడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని రమణరాజు విమర్శించారు.

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు, ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండానే కొత్త దశల పేరుతో భూసమీకరణ కొనసాగించడం బాధాకరమన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణంలో దుబారా ఖర్చులు, అవినీతి ఆరోపణలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన నిధులను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేయకుండా, అప్పులపైనే ఆధారపడడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెం.1397ను రద్దు చేయాలని, రాజధాని నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి పారదర్శక చర్చ జరపాలని రమణరాజు కోరారు. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సమకూర్చుకుని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :