యాడికి, అనంతపురం జిల్లా: యాడికి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. మండల పరిధిలోని 16 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 89 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగగా, అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
దాఖలైన నామినేషన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున 43 మంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 27 మంది, భారతీయ జనతా పార్టీ తరఫున 4 మంది, జనసేన పార్టీ తరఫున ఒకరు, స్వతంత్ర అభ్యర్థులుగా 14 మంది నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా యాడికి పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ ఎన్నికల నియమావళి మేరకు ప్రశాంతంగా ప్రక్రియ కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) నిర్వహించనున్నారు. అక్టోబర్ 25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించగా, అక్టోబర్ 26న ఎన్నికల అధికారి వాటిపై తుది నిర్ణయం ప్రకటిస్తారు.
అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా, అదే రోజు సాయంత్రం తుది పోటీ అభ్యర్థుల జాబితాను నోటీస్ బోర్డులో ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.
నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనుండగా, అవసరమైతే నవంబర్ 4న రీపోలింగ్ చేపట్టనున్నారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటించి, విజేతలకు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు.








