contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రధాన రహదారిపై ప్రమాదకర ఓపెన్ గుంత.. ఎప్పుడు పూడుస్తారు?

  • పైపులైన్ మరమ్మతుల పేరుతో తవ్వి వదిలేసిన గుంత.. నిత్యం వాహనదారులకు ఇబ్బందులు
  • రిపోర్టర్ టీవీ వార్తా సేకరణ సమయంలోనే తృటిలో తప్పిన ప్రమాదం

 

గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్‌లో ప్రధాన రహదారి పక్కన తవ్వి వదిలేసిన ఓపెన్ గుంత స్థానికులు, వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. సింగరేణి పైపులైన్ మరమ్మతుల కోసం కాలువ పక్కన తవ్విన గుంతను పనులు పూర్తయిన తర్వాత కూడా పూడ్చకపోవడంతో ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే వందలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి జీఎం కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఈ గుంత ఉండటం వల్ల చిన్న కాలువ వంతెన వద్ద రాకపోకలు మరింత ప్రమాదకరంగా మారాయి. వంతెన ఇరుకుగా ఉండటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఒకదానికొకటి దాటే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పైపులైన్‌లో గాలి బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన చిన్న రంధ్రాల నుంచి నిరంతరం నీరు లీకవుతుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోందని వారు చెబుతున్నారు. గుంతను పూర్తిగా పూడ్చివేసి, నీటి లీకేజీని నియంత్రించేందుకు అక్కడ చిన్న ట్యాంకు ఏర్పాటు చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా, రిపోర్టర్ టీవీ ఈ సమస్యపై వార్తా సేకరణ నిర్వహిస్తున్న సమయంలోనే అదే ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనే పరిస్థితి ఏర్పడింది. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పినా, వాహనదారులు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన స్థానికుల్లో మరింత ఆందోళన కలిగించింది.

మరోవైపు కాలువలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ప్రధాన రహదారిపై ఇంత ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సంబంధిత సింగరేణి యాజమాన్యం, 37వ డివిజన్ కార్పొరేటర్ వెంటనే స్పందించి గుంతను పూడ్చివేయడంతో పాటు పైపులైన్ లీకేజీని శాశ్వతంగా పరిష్కరించాలని బస్తీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారకముందే అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :