నరసరావుపేట – మాచర్ల : జిల్లా స్థాయి అండర్-17 బాలికల క్రికెట్ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన స్థానిక నారాయణ పాఠశాల విద్యార్థిని కె. గాయత్రిని పాఠశాల యాజమాన్యం ఘనంగా అభినందించింది. ప్రస్తుతం ఆమె నారాయణ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది.
ఇటీవల నరసరావుపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-17 బాలికల క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన గాయత్రి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని మండల విద్యాధికారి కె. కోటేశ్వరరావు మరియు పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించడం ఎంతో అవసరమన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గాయత్రి సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆంజనేయులు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రయ్య, విద్యార్థిని తల్లిదండ్రులు డాక్టర్ కె.పి. చారి, ఇతర పాఠశాల సిబ్బంది పాల్గొని గాయత్రికి శుభాకాంక్షలు తెలియజేసి, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.








