జగిత్యాల జిల్లా ,మెట్ పల్లి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్ గ్రామంలో ఆర్మీ సైనికుడు తిగుర్ల స్వామిపై దాడి కేసులో 14 మందిని అరెస్ట్ చేసి 14 సెల్ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, ఒక స్టీల్ చేతి కడియాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మెట్ పల్లి సీఐ బి. సురేష్ బాబు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 22న రాత్రి వెల్లుల్ల గ్రామానికి చెందిన వన్నెల వికాస్‌పై బండలింగాపూర్ వాసులు దాడి చేశారనే కారణంతో వికాస్ స్నేహితులు సుమారు 30 మంది గుంపుగా ఏర్పడి అర్ధరాత్రి దాటాక బండలింగాపూర్ వెళ్లి అక్టోబర్ 23 తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో హనుమాన్ ఆలయం వద్ద బతుకమ్మ ఆడుతున్న వారి పక్క నుండి వేగంగా, నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లడంతో అక్కడ ఉన్న ఆర్మీ సైనికుడు తిగుర్ల స్వామి ప్రశ్నించగా, వాగ్వాదం జరిగి, నిందితులు స్టీల్ చేతి కడియంతో ముఖంపై కొట్టి, తీవ్ర రక్తగాయం చేయడంతో బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అక్టోబర్ 24న ఉదయం మేడిపల్లి శివారు ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్డు వద్ద వెల్లుల్ల గ్రామానికి చెందిన 1) బావు రమేష్, 2) తుపాకుల స్వామి, 3) బావు అఖిల్, 4) లక్కంపల్లి కార్తీక్, 5) మర్రి నీరజ్, 6) లక్కంపల్లి కళ్యాణ్, 7) ఐలేని వంశీ, 8) కల్లూరి మహేష్, 9) కల్లూరి వంశీ, 10) కాంతి విశాల్, 11) బొబ్బిలి నాగరాజ్, 12) పోచంపల్లి సాయి, 13) మంచాల పవన్, 14) కల్లూరి రవి లను అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరిగిందని, మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా మెట్పల్లి సీఐ బి. సురేష్ బాబు, ఇబ్రహీంపట్నం ఎస్ఐ జి. నవీన్ కుమార్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించి, అర్ధరాత్రి బయటకు వెళ్లకుండా, గుంపులుగా తిరుగుతూ గొడవలు, దాడులకు పాల్పడకుండా చూడాలని సూచించారు. చెడు స్నేహాలకు దూరంగా ఉంచాలని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.









