మెదక్, తూప్రాన్ : దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కష్టపడి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరవీరులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం, సమాజం కోసం సేవలందించి అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి త్యాగాలను గౌరవించడం ప్రతి పౌరుడి కనీస బాధ్యత అని పేర్కొన్నారు.
పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రకృతి విపత్తులు, అకాల వర్షాలు, అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా నిలుస్తూ విశేష సేవలు అందిస్తున్నారని ఆమె కొనియాడారు.
ప్రతిరోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. అమరవీరుల త్యాగాలు వృథా కాకుండా వారి ఆశయాలను కొనసాగిస్తూ మరింత బాధ్యతాయుతంగా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో శాంతిభద్రతలు నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, ముఖ్యంగా సైబర్ నేరాలను వేగంగా ఛేదించి నేరస్థులను అదుపులోకి తీసుకురావడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు.
కార్యక్రమంలో పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కలిసి గిఫ్ట్ ప్యాక్‌లు అందజేశారు. అలాగే పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








