తూప్రాన్, మెదక్ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పోలీసు అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్ద తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజ గౌడ్, ఎస్ఐలు జ్యోతి, యాదగిరితో పాటు తూప్రాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పుష్పాంజలి ఘటించి అమరవీరుల సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను కొనియాడారు. దేశం, సమాజం కోసం వారు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, పోలీసు శాఖకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
పోలీసు అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత బాధ్యతాయుతంగా సేవలందించేందుకు కృషి చేస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు








