పల్నాడు జిల్లా – మాచర్ల : విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. పట్టణంలోని నారాయణ స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) క్రీడా పోటీలు స్థానిక శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి క్రీడా ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ కృష్ణ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రాజశేఖరరెడ్డి, పల్నాడు జిల్లా ఏజీఎం జానకి రామిరెడ్డి, ఆర్ అండ్ డి హెడ్ స్వాతి, ఈ-చాంప్స్ జెడ్ సీఈవో షేక్ గౌసియా, పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో క్రీడల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన రన్నింగ్ రేస్, డ్రాప్ ది బాల్, రెడీ టు స్కూల్, డంబెల్ ఈవెంట్లు, తగ్ ఆఫ్ వార్, పొటాటో రేస్ తదితర క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథులు మెమెంటోలు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి, స్కూల్ ఇన్చార్జిలు ఆంజనేయులు, ఉదయలక్ష్మి, చంద్రిక, వ్యాయామ ఉపాధ్యాయుడు చంద్రయ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవి నాయక్, ఉపాధ్యాయులు విజయలత, రామాంజలి, శైలజాతో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడా ప్రాంగణం విద్యార్థుల కేరింతలతో సందడిగా మారింది.








