contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హత్య జరిగిన 12 గంటల్లోనే కేసును ఛేదించిన గోదావరిఖని పోలీసులు

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్‌హౌస్ కాలనీలో సింగరేణి కార్మికుడు అట్ల రాజశేఖర్ హత్య కేసును గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంతో పాటు నేరానికి ఉపయోగించిన ఆటో, రెండు కత్తులు, సెల్‌ఫోన్లు, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి వెల్లడించారు. పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలే ఈ హత్యకు కారణమని ఆయన తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల 22వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అట్ల రాజశేఖర్ తిరిగి ఇంటికి చేరుకోలేదు. మరుసటి రోజు తెల్లవారుజామున పవర్‌హౌస్ కాలనీలోని శివాలయం సమీపంలో, బాలయ్య కిరాణా దుకాణం ఎదురుగా అతను హత్యకు గురైనట్లు గుర్తించారు. మృతుడి తండ్రి అట్ల మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో ప్రధాన నిందితుడు ఎన్నం ప్రసాద్‌కు రాజశేఖర్‌తో గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, గత ఆరు నెలలుగా ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు తీవ్రరూపం దాల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్‌లో తరచూ వాగ్వాదాలు, పరస్పర దూషణలు, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల కక్ష పెంచుకున్న ప్రసాద్, తన స్నేహితులు ఎడ్లపల్లి శ్రావణ్ కుమార్, అయిలీ దేవేందర్, బోరె మల్లేష్‌లతో కలిసి హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

హత్యకు ముందుగానే ఒక పెద్ద కత్తిని కొనుగోలు చేసి ఆటోలో ఉంచగా, మరో నిందితుడు చిన్న కత్తిని వెంట తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. ఈ నెల 22వ తేదీ సాయంత్రం రాజశేఖర్‌తో మరోసారి ఫోన్‌లో వాగ్వాదం జరిగిన అనంతరం నలుగురు నిందితులు బృందావన్ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమానికి వెళ్లి, అక్కడి నుంచి తిరిగి పవర్‌హౌస్ కాలనీలోని బాలయ్య కిరాణా దుకాణం వద్ద రాజశేఖర్ కోసం మాటువేసినట్లు పోలీసులు వెల్లడించారు.

23వ తేదీ తెల్లవారుజామున సుమారు 1.10 గంటల సమయంలో రాజశేఖర్ మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా నిందితులు అడ్డగించి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

హత్య అనంతరం నిందితులు తమపై ఆధారాలు లభించకుండా రక్తపు మరకలు ఉన్న దుస్తులను కాల్చివేసి, బూడిదను గోదావరి నదిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించిన వారిని విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు గుర్తించి, 5 ఇంక్లైన్ చౌరస్తా సమీపంలో నేరానికి ఉపయోగించిన ఆటోలో వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు.

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సూచనలతో, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ పర్యవేక్షణలో వన్‌టౌన్ ఇన్‌చార్జి సీఐ లింగమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి వేగవంతమైన దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది.

ఈ కేసులో పోలీసులు నేరానికి ఉపయోగించిన టీజీ-22-టీ-2866 నంబర్ పసుపు రంగు ఆటో, రెండు కత్తులు, మూడు సెల్‌ఫోన్లు, రక్తపు మరకలు ఉన్న టీ-షర్టును స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీసీపీ బి. రామ్ రెడ్డి మాట్లాడుతూ, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచుతుందని స్పష్టం చేశారు. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. వ్యక్తిగత కక్షలు, కుటుంబ వివాదాలను హింసతో కాకుండా చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు.

హత్య జరిగిన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న గోదావరిఖని వన్‌టౌన్ పోలీసు బృందాన్ని డీసీపీ బి. రామ్ రెడ్డి, ఏసీపీ ఎం. రమేష్ అభినందించారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సీఐ లింగమూర్తి, ఎస్సైలు మనోహర్, రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ సదయ్యతో పాటు కానిస్టేబుళ్లు బి. ప్రకాష్, ఐ. రమేష్, మధుకర్, మధుసూదన్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :