contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు హైకోర్టు తీర్పు మేరకే నిర్వహించాలి: రమణరాజు

కాకినాడ : కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలను హైకోర్టు తీర్పును గౌరవిస్తూ రాజ్యాంగబద్ధంగా 68 డివిజన్లతో నిర్వహించాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్‌కు సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు.

రమణరాజు మాట్లాడుతూ, కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని 42, 48 డివిజన్లలోకి వచ్చే ఎస్. అచ్యుతాపురం, స్వామినగర్, గంగనాపల్లి ప్రాంతాల విలీనానికి వ్యతిరేకంగా 2017లో దాఖలైన రిట్ పిటిషన్‌ను గౌరవ హైకోర్టు అక్టోబర్ 15, 2026న తుది తీర్పుతో కొట్టివేసిందని గుర్తు చేశారు. దీంతో ఈ ప్రాంతాల విలీనానికి ఎటువంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని, వెంటనే కార్పొరేషన్ పరిధిలోకి చేర్చాలని కోరారు.

అదేవిధంగా తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట గ్రామాలు గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారం పంచాయతీ రాజ్ పరిధి నుంచి ఇప్పటికే వేరు చేయబడినందున, అక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ ఆరు గ్రామాలను అధికారికంగా కార్పొరేషన్‌లో విలీనం చేయకుండా ఎన్నికలు నిర్వహించడం చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుతం అధికారులు 2005 నాటి పాత భౌగోళిక సరిహద్దులను ఆధారంగా తీసుకుని అప్పటి 48 డివిజన్లను 66 డివిజన్లుగా మారుస్తూ ఓటర్ల జాబితా తయారీ, రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారని రమణరాజు విమర్శించారు. ఈ విధానం చట్టబద్ధమైనది కాదని, వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

2011 జనాభా లెక్కల ఆధారంగా విలీన గ్రామాలన్నింటినీ కలుపుకొని మొత్తం 68 డివిజన్లకు కొత్తగా సరిహద్దులు ఖరారు చేయాలని ఆయన సూచించారు. అదే ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా అమలు చేయాలని కోరారు.

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో నెలకొన్న సుదీర్ఘ వివాదాల కారణంగా నగరం ఇప్పటికే సుమారు రూ.1,000 కోట్ల కేంద్ర ఆర్థిక సంఘం నిధులను కోల్పోయిందని రమణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి 68 డివిజన్లతో ఎన్నికలను త్వరితగతిన నిర్వహించి, 2026-27 సంవత్సరానికి సంబంధించిన 16వ ఆర్థిక సంఘం నిధులను కాకినాడకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై తదుపరి చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీ రాజ్ శాఖ, మున్సిపల్ డైరెక్టరేట్, గవర్నర్ కార్యాలయం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాలకు కూడా వినతిపత్రం ప్రతులను పంపించినట్లు దూసర్లపూడి రమణరాజు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :