గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: రైతులు నేల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు నిర్వహిస్తున్న “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమంలో భాగంగా మంగళవారం గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మానకొండూర్ వ్యవసాయ సహాయ సంచాలకుడు (ఏడీఏ) ఎన్. శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, జమ్మికుంట కేవీకే శాస్త్రవేత్త మహేష్ హాజరై రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అధికారులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం వ్యవసాయంపై చూపే ప్రభావాన్ని వివరించారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ కాలపరిమితి కలిగిన పంట రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు.
మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి మాట్లాడుతూ, ఖేత్ బచావో అభియాన్ ప్రధాన లక్ష్యం నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, అలాగే ఆరుతడి ప్రాంతాలకు అనుకూలమైన నూనెగింజలు, పప్పుధాన్యాల సాగును విస్తరించడం అని తెలిపారు. శాస్త్రీయ విధానాలను అనుసరించడం ద్వారా దిగుబడులు పెరగడంతో పాటు సాగు వ్యయాన్ని కూడా తగ్గించుకోవచ్చని రైతులకు వివరించారు.
ఏడీఏ ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ, వరి కోత అనంతరం మిగిలే కొయ్యకాలు, పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల నేల సారవంతత దెబ్బతింటుందని చెప్పారు. అలాంటి చర్యలకు దూరంగా ఉండి సేంద్రీయ ఎరువులు, జీవామృతం వంటి సహజ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రైతులకు సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఖాసీంపేట, పారువెల్ల, మైలారం, సాంబయ్యపల్లి గ్రామాలకు చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొని అధికారులు అందించిన సూచనలు, సలహాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. రైతులు శాస్త్రీయ సాగు విధానాలను అనుసరించి పంటల దిగుబడిని పెంచుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.








