తూప్రాన్, మెదక్ జిల్లా : బాలికను మాయమాటలతో నమ్మించి వెంట తీసుకెళ్లిన కేసులో నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 8వ తరగతి చదువుతున్న బాలికను ఆమె తండ్రి 2025 అక్టోబర్ 14న హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కించారు. అయితే వడియారం వద్ద బస్సు ఆగకపోవడంతో బాలిక చేగుంటలో దిగింది. ఈ సమయంలో తనకు పరిచయమున్న ఆనంద్ (22) అనే యువకుడికి ఫోన్ చేసి, తనను హాస్టల్ వద్ద దింపాలని కోరింది.
అక్కడికి చేరుకున్న ఆనంద్ బాలికను మాయమాటలతో నమ్మించి తనతో ఉంటే బాగా చూసుకుంటానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. తొలుత మేడ్చల్‌కు, అనంతరం నిజామాబాద్‌కు తీసుకెళ్లిన అతడు మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్‌కు చేరుకుని తన పిన్ని ఇంటికి బాలికను తీసుకెళ్లాడు.
అయితే బాలికను ఇంటికి పంపించాలని ఆనంద్ తల్లి సూచించడంతో 2025 అక్టోబర్ 15 రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరూ బస్‌స్టాండ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉన్న తూప్రాన్ పోలీసులు బాలికను గుర్తించి సురక్షితంగా భరోసా కేంద్రానికి తరలించారు.
ఈ ఘటనపై తొలుత తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు కాగా, అనంతరం కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి ఎస్‌ఐ ఎన్. జ్యోతి కీలక సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు.
విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించగా, లీగల్ అడ్వైజర్ శ్వేత బాధిత బాలిక కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు అవసరమైన సహకారం అందించారు. అలాగే కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణగౌడ్, సీడీఓ నాగరాజు కేసు విచారణలో సమన్వయంతో పనిచేశారు.
సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మెదక్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభవల్లి నిందితుడు ఆనంద్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, బాధిత బాలికకు న్యాయం జరిగేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, న్యాయ బృందాన్ని అభినందించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారిపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.








