గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌తో పాటు యజమానిపై కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి గ్రామ పరిధిలోని బిక్కవాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లో ఇసుకను గన్నేరువరం గ్రామానికి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చొక్కారావుపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని గన్నేరువరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనలో కూనవానిపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కూన సురేష్‌తో పాటు గన్నేరువరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని కవ్వంపల్లి హరీష్‌పై కేసు నమోదు చేసినట్లు గన్నేరువరం ఎస్సై జి. నరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై జి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.








