contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : రామగిరి ఎస్సై శ్రీనివాస్

గోదావరిఖని : సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సైబర్ మోసాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రామగిరి ఎస్సై తాడవేన శ్రీనివాస్ సూచించారు.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్‌లోని సింగరేణి ఆర్జీ-3 వీటీసీ ట్రైనింగ్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన సైబర్ జాగృతి దివస్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

ఈ సందర్భంగా ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించే మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు నంబర్లు, సీవీవీ, ఓటీపీ వంటి గోప్యమైన సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని హెచ్చరించారు.

అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం వంటి చర్యలు సైబర్ మోసాలకు దారితీస్తాయని వివరించారు. ప్రజలు ప్రతి ఆన్‌లైన్ లావాదేవీలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే భయపడకుండా స్పందించాలని, డబ్బులు కోల్పోయిన సందర్భంలో ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. అలాగే సమీప పోలీస్ స్టేషన్‌ను కూడా సంప్రదించాలని తెలిపారు.

సైబర్ నేరాలపై గ్రామస్థులు అవగాహన పెంచుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులకు కూడా ఈ విషయాలను తెలియజేయాలని కోరారు. ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, సైబర్ నేరాల నివారణ కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని ఎస్సై తాడవేన శ్రీనివాస్ తెలిపారు.

పోలీసుల సూచనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ సైబర్ నేరాల రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :