మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్ మండలం రామయిపల్లి శివారులో ఉన్న ఇండస్ మెడికేర్ పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. ఐఎన్టీయూసీ, బీఆర్టీయూ కూటమిపై సీఐటీయూ విజయం సాధించి యూనియన్ గుర్తింపును దక్కించుకుంది.
మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 68 ఓట్లకు గాను 68 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సీఐటీయూకు 38 ఓట్లు రాగా, ఐఎన్టీయూసీకి 25 ఓట్లు లభించాయి. దీంతో సీఐటీయూ 13 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
ఈ ఎన్నికల్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మనోహరాబాద్ మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని ఐఎన్టీయూసీ కూటమి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లికార్జున్ నేతృత్వంలోని సీఐటీయూతో పోటీ పడింది.
విజయం అనంతరం కార్మికులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు జె. మల్లికార్జున్ మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి విజయం అందించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో చర్చలు జరిపి ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. పరిశ్రమ ప్రాంతంలో మెరుగైన వేతన ఒప్పందం సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
కార్మిక సంఘాల ఎన్నికల్లో డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, బెదిరింపులు వంటి పద్ధతులు సరైనవి కావని మల్లికార్జున్ అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా ఓటు వేసిన కార్మికులను ఆయన అభినందించారు.
పరిశ్రమలోని సమస్యల పరిష్కారంతో పాటు దేశవ్యాప్తంగా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటానికి కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా సహకరించిన కార్మిక శాఖ, పరిశ్రమ యాజమాన్యం, పోలీస్ శాఖ, మీడియా ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, యూనియన్ ప్రధాన కార్యదర్శి బాలేష్, నాయకులు సుజాత, తిరుపతి, పూర్ణేష్, ఉపేంద్ర, విక్రమ్ రెడ్డి, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.








