గోదావరిఖని, నవంబర్ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. ఓ ఇంటి సమీపంలో, రోడ్డుకు ఆనుకుని ఎలాంటి రక్షణ కంచె లేకుండా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కారణంగా ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు ప్రమాదం పొంచి ఉందని రిపోర్టర్ టీవీ కథనంలో ప్రస్తావించగా, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.
మంగళవారం 12వ డివిజన్ కార్పొరేటర్ బాబుమియా ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేశారు. దీంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం గణనీయంగా తగ్గిందని స్థానికులు తెలిపారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వేగంగా స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో పాటు కార్పొరేటర్ బాబుమియాను 12వ డివిజన్ అధ్యక్షుడు కుంట సదియాత్, అధ్యక్షుడు తోటపెల్లి రమేశ్ అభినందించారు. బస్తీవాసులు కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి దోహదపడుతున్న రిపోర్టర్ టీవీ పాత్రను స్థానికులు ప్రశంసించారు. సమస్యను ప్రసారం చేసిన కొద్ది సమయంలోనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టడం సంతోషకరమని వారు పేర్కొన్నారు.








