contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సికింద్రాబాద్ బస్సు రాక .. ప్రయాణికుల అవస్థలు

గన్నేరువరం : కరీంనగర్ డిపో నుంచి గన్నేరువరం, బెజ్జంకి, సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సు బుధవారం రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిత్యం ఈ బస్సు సర్వీసుపై ఆధారపడే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులు గంటల తరబడి బస్ స్టాండ్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉదయం నుంచే గన్నేరువరం, బెజ్జంకి తదితర గ్రామాల బస్ స్టాండ్లలో బస్సు కోసం నిరీక్షించిన ప్రయాణికులు చివరకు నిరాశతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కొందరు ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు సాధారణ ఛార్జీల కంటే అధికంగా వసూలు చేయడంతో ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై ఆర్టీసీ అధికారులను వివరణ కోరగా, సంబంధిత డ్రైవర్, కండక్టర్ సకాలంలో విధులకు హాజరుకాకపోవడంతో ఆ రోజు బస్సు సర్వీసును రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఈ సమాధానంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, ఈ బస్సు సర్వీస్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రద్దవుతుందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోయారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌కు వెళ్లే ఈ మార్గంలో ప్రత్యామ్నాయ ఆర్టీసీ సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.

సమయపాలన పాటించకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకుని, గన్నేరువరం–బెజ్జంకి–సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్లే ఈ ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రతిరోజూ క్రమం తప్పకుండా, సమయానికి నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :