గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్‌లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేద కుటుంబం తమ స్థలాన్ని కాపాడుకోవడానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కడం లేదని బాధితుడు క్షత్రియ కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో తమ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం రామగుండం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన గోడును మీడియా ముందు వివరించారు.
క్షత్రియ కమల్ తెలిపిన వివరాల ప్రకారం, తన తండ్రి గోపి, తల్లి పద్మ కుటుంబం గత 50 నుంచి 60 ఏళ్లుగా ఎన్టీఆర్ నగర్‌లోని అదే స్థలంలో నివాసముంటోంది. పూర్వీకుల కాలం నుంచి తమ కుటుంబం అక్కడే జీవనం సాగిస్తోందని, కుటుంబ అవసరాల దృష్ట్యా ఇంటి ముందున్న పాత స్నానాల గదిని తొలగించి ఆ స్థానంలో కొత్త గది నిర్మించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
నిర్మాణ పనుల కోసం స్థలాన్ని చదును చేసి పునాదులు వేస్తున్న సమయంలో పక్కనే నివాసముంటున్న ప్రభు సాగర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పనులను అడ్డుకున్నారని కమల్ ఆరోపించారు. అంతేకాకుండా నిర్మాణానికి వేసిన పునాదులను ధ్వంసం చేయడంతో పాటు తమపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై వెంటనే గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కమల్ తెలిపారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి విచారణ నిర్వహించి, ఎవరి హద్దుల్లో వారు ఉండాలని సూచించారని చెప్పారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సమయంలో స్థానిక కాలనీవాసులు కూడా ఆ స్థలం తమ కుటుంబానిదేనని స్పష్టం చేసినట్లు వెల్లడించారు.
అయితే అనంతరం అధికార పార్టీకి చెందిన స్థానిక కార్పొరేటర్‌తో పాటు పలువురు నాయకులు పోలీస్‌స్టేషన్‌కు రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని కమల్ ఆరోపించారు. తన ఫిర్యాదుపై న్యాయం జరగకుండా తనకే సర్దిచెప్పి పంపించారని, కార్పొరేటర్‌కు సన్నిహితుడిగా చెప్పబడుతున్న ప్రభు సాగర్ వివాదాస్పద స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై తహసీల్దార్, పోలీస్ ఏసీపీ, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌లను ఆశ్రయించి పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదని కమల్ తెలిపారు. గత ఆరు నెలలుగా అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తన సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కుటుంబం దశాబ్దాలుగా నివాసముంటున్న స్థలంపై జరిగిన వివాదాన్ని అధికారులు నిష్పక్షపాతంగా విచారించాలని, అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిజానిజాలు వెలికితీయాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని క్షత్రియ కమల్ ప్రభుత్వాన్ని కోరారు.








