contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆరు విలీన గ్రామాలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలి

కాకినాడ : కాకినాడ జిల్లా, రూరల్ పరిధిలో నవంబర్ 5న నిర్వహిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆరు విలీన గ్రామాలకు చెందిన ఓటర్లకు అవకాశం కల్పించకపోవడంపై కాకినాడ పౌర సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. రమణయ్యపేట, ఇంద్రపాలెం, వాకలపూడి, తూరంగి, వలసపాకల, చీడిగ గ్రామాల ప్రజలకు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కు ఎందుకు కల్పించలేదని సంఘం ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించింది.

సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఆరు గ్రామాల పరిధిలో గతంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండేవని తెలిపారు. 2015లో గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా ఈ గ్రామాలను కాకినాడ నగరపాలక సంస్థలో విలీనం చేయడంతో గ్రామీణ స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ఎంపీటీసీ స్థానాలు రద్దయ్యాయని పేర్కొన్నారు.

అలాగే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాకినాడ రూరల్ పరిధిలోని ఆరు గ్రామాలను తిరిగి పరిగణనలోకి తీసుకుని, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇంద్రపాలెం, చీడిగ, తూరంగి, రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాల జనాభాతో 68 డివిజన్ల ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని డిమాండ్ చేశారు.

కోర్టు వివాదాలు, ఆర్డినెన్స్, జీవో ప్రక్రియల కారణంగా ఈ గ్రామాలను పంచాయతీరాజ్ పరిధి నుంచి వేరు చేయడం జరిగిందని, అందువల్ల ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో ఈ గ్రామాలకు స్థానాలు కేటాయించలేదని పేర్కొన్నారు.

కాకినాడ కార్పొరేషన్‌కు సంబంధించి 42, 48 డివిజన్ల కేసులు, గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా విలీనం చేసిన ఆరు గ్రామాల అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైకోర్టు పరిధిలో ఉన్న అంశాలు పూర్తిగా పరిష్కారం కాకముందే ఎన్నికల ప్రక్రియ చేపట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం విలీన గ్రామాలకు సంబంధించిన 120 హైకోర్టు రిట్ కేసుల పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు తొందరపడటం సరికాదని రమణరాజు అన్నారు. కేవలం ఒక్క రోజులో డివిజన్ల సరిహద్దుల నిర్ణయం, రిజర్వేషన్ల ప్రక్రియలో లోపాలు జరిగాయని ఆరోపించారు.

హైకోర్టు విచారణ అనంతరం నవంబర్ మూడవ వారంలో 68 డివిజన్ల మేరకు ఎన్నికల పునఃప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. డివిజన్ల విభజన, ఓటరు జాబితా, ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా లెక్కల విషయంలో ఉన్న లోపాలను సరిచేసి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎన్నికల సంఘం తీసుకోవాలని కోరారు.

ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగానికి విషయాన్ని తెలియజేస్తూ బుధవారం సాయంత్రం పౌర సంక్షేమ సంఘం తరఫున దూసర్లపూడి రమణరాజు ప్రకటన విడుదల చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :