చేగుంట–తూప్రాన్ : సంగారెడ్డి జిల్లా వోక్సన్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా అస్మిత అండర్-15, అండర్-18 బాలికల రగ్బీ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన జట్లు పాల్గొని ప్రతిభ కనబరిచాయి.
అండర్-15 బాలికల విభాగంలో ఖమ్మం, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, కరీంనగర్, వనపర్తి, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, జనగాం, పెద్దపల్లి, మేడ్చల్, మెదక్, వరంగల్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు చెందిన మొత్తం 16 జట్లు పోటీపడ్డాయి. ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఖమ్మం జిల్లా జట్టు విజేతగా నిలవగా, నల్గొండ జిల్లా రన్నరప్‌గా నిలిచింది. వనపర్తి జిల్లా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.
అండర్-18 బాలికల విభాగంలో ఖమ్మం, వరంగల్, ఆసిఫాబాద్, కరీంనగర్, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, వనపర్తి, పెద్దపల్లి, మెదక్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలకు చెందిన 12 జట్లు పోటీపడ్డాయి. ఈ విభాగంలో మెదక్ జిల్లా జట్టు అద్భుత ఆటతీరుతో ఛాంపియన్‌గా నిలవగా, నల్గొండ జిల్లా రెండో స్థానాన్ని, ఖమ్మం జిల్లా మూడో స్థానాన్ని దక్కించుకుంది.
పోటీల ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వోక్సన్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఇన్‌చార్జి విశాల్, రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కరణం గణేష్ రవికుమార్, రగ్బీ ఇండియా అబ్జర్వర్ నోయెల్ మ్యాత్యు, ఫిజియో డాక్టర్ అర్జున్ ప్రసాద్, డాక్టర్ రాంబాబు, రగ్బీ టెక్నికల్ ఇన్‌చార్జ్ సాయి చరణ్‌తో పాటు శేషు, శ్రీధర్, మహేష్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేసి అభినందించారు. రాష్ట్రంలో రగ్బీ క్రీడ అభివృద్ధికి ఖేలో ఇండియా అస్మిత పోటీలు మంచి వేదికగా నిలుస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.








