గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్ లో ఉన్న సింగరేణి కమ్యూనిటీ హాల్ అధ్వానంగా మారి ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉంటోంది. 43, 44 డివిజన్ల పరిధిలో నివసించే సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు ఉపయోగపడాల్సిన ఈ కమ్యూనిటీ హాల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది.
సింగరేణి కార్మికులు తమ కుటుంబాల్లో జరిగే వివాహాలు, ఇతర శుభకార్యాలను తక్కువ ఖర్చుతో నిర్వహించుకునేందుకు ఈ కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అయితే ప్రస్తుతం హాల్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అద్దె చెల్లించాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి సంస్థకు సేవలందిస్తున్న కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు స్పందించాలని కార్మికులు కోరుతున్నారు. నిరుపయోగంగా ఉన్న కమ్యూనిటీ హాల్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్‌ను కార్మికులకే అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.








