పల్నాడు జిల్లా – మాచర్ల : పట్టణంలోని వివిధ హోటళ్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లపై పల్నాడు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల అధికారి మాచర్ల పట్టణంలోని పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 12 గ్యాస్ సిలిండర్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచిన హోటల్ యజమానులపై కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, అనధికారికంగా వినియోగించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున హోటల్ నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
నిబంధనలను ఉల్లంఘించి గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, వినియోగించినా సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థల్లో తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.








