హైదరాబాద్: పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. బాధితుడి నుంచి నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ బృందం దాడి చేసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసుకు సంబంధించి చార్జ్‌షీట్ దాఖలు చేయాలని బాధితుడు ఎస్సై శ్రీనివాస్‌ను కోరినట్లు సమాచారం. అయితే ఈ పని పూర్తి చేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంలో లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శిల్పానగర్ వద్ద బాధితుడి నుంచి ఎస్సై శ్రీనివాస్ రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు.
కీసర పోలీస్ స్టేషన్‌లో వరుస అవినీతి ఆరోపణలు
కీసర పోలీస్ స్టేషన్‌లో కొద్ది నెలల వ్యవధిలోనే మరో అవినీతి ఘటన వెలుగులోకి రావడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇదే పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేసిన ఆరోపణలపై అప్పటి ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. ఆ ఘటన మరువకముందే తాజాగా మరో ఎస్సై లంచం తీసుకుంటూ పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటనపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. పట్టుబడిన ఎస్సై శ్రీనివాస్‌ను తదుపరి చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.








