పల్నాడు జిల్లా : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు–2026లో భాగంగా పల్నాడు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్ పర్యవేక్షణలో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి సమాజానికి ఉపయోగపడే పలు సమకాలీన అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. “డ్రగ్స్ కలలను చిద్రం చేస్తాయి – మత్తుపదార్థాలు లేని సమాజాన్ని ఎలా నిర్మించగలం”, “సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం యువతకు స్ఫూర్తి”, “సైబర్ నేరాలపై అవగాహన”, “సురక్షిత సమాజం – నాతో ప్రారంభం” వంటి అంశాలపై సిబ్బంది తమ ఆలోచనలు, విశ్లేషణలను రచనల రూపంలో వెల్లడించారు.
పోటీల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది మత్తుపదార్థాల వినియోగం యువత భవిష్యత్తు, కుటుంబ వ్యవస్థ, సమాజ అభివృద్ధిపై చూపుతున్న ప్రతికూల ప్రభావాలను వివరించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో పోలీసులతో పాటు విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని తమ వ్యాసాల్లో ప్రస్తావించారు.
అదేవిధంగా “యూనిఫాం వెనుక పోలీసుల త్యాగం మరియు సేవ” అనే అంశంపై జరిగిన చర్చలో, పోలీస్ ఉద్యోగం కేవలం వృత్తి మాత్రమే కాదని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడే అంకితభావంతో కూడిన సేవ అని పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు. కుటుంబ వేడుకలు, పండుగలు, వ్యక్తిగత అవసరాలను పక్కనపెట్టి ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సేవలను గుర్తుచేశారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ, వారి ఆదర్శాలను ప్రతి పోలీసు సిబ్బంది అనుసరించాలని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ గోపీనాథ్‌తో పాటు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల లక్ష్యాలకు అనుగుణంగా సిబ్బందిలో సేవాభావం, సామాజిక బాధ్యత, ప్రజా భద్రత పట్ల మరింత చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు.








