గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో ఎలుగుబంటి సంచారం రైతులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. బుధవారం ఉదయం చొక్కారావుపల్లె గ్రామ శివారులోని చిట్కూరి మల్లారెడ్డి వ్యవసాయ పొలంలో ఎలుగుబంటి కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది.
ఉదయం సుమారు 7 గంటల సమయంలో వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన రైతులు కుంట మల్లారెడ్డి, తిరుమలకు ఎలుగుబంటి కనిపించింది. అనూహ్యంగా ఎలుగుబంటిని చూసిన వారు భయంతో అక్కడి నుంచి గ్రామానికి పరుగులు తీసి గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించారు.
గ్రామ సర్పంచ్ అరికాంతం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, గత నెల రోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం రైతుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే గన్నేరువరం ఎస్ఐతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ఎలుగుబంటి అడుగుజాడలను పరిశీలించారు. ఎలుగుబంటి సంచరించిన దిశను గుర్తించి పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా ఎలుగుబంటి సంచరిస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో పొలాలకు వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి ఎలుగుబంటిని సురక్షితంగా బోనులో బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామాల్లో అప్రమత్త చర్యలు చేపట్టాలని, ప్రజలకు తగిన సూచనలు ఇవ్వాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.








