contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎసిబి వలలో చిక్కిన బంజారాహిల్స్ ఎస్సై విజయ్

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఓ కేసులో సహాయం చేస్తానని చెప్పి ఫిర్యాదుదారుడి నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

సమాచారం ప్రకారం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్, ఓ ఫిర్యాదుదారుడి నుంచి కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.10 లక్షలు లంచం కోరినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళికలో భాగంగా బుధవారం ఫిర్యాదుదారుడు ఎస్‌ఐ విజయ్‌కు రూ.1 లక్ష లంచం అందజేస్తుండగా, ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్‌లోనే దాడి చేసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పోలీస్ స్టేషన్‌లోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. అనంతరం ఏసీబీ అధికారులు ఎస్‌ఐ విజయ్‌ను అదుపులోకి తీసుకుని తమ కార్యాలయానికి తరలించి విచారణ ప్రారంభించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం డిమాండ్ చేసిన ఆరోపణలు, ఇతర అంశాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం. ఈ సంఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :