contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాకినాడ ఎన్నికలపై పౌర సంఘం సంచలన వ్యాఖ్యలు

కాకినాడ : కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంపై పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు హర్షం వ్యక్తం చేశారు. అయితే 42, 48 డివిజన్లతో పాటు విలీన గ్రామాలను ఎన్నికల ప్రక్రియలో చేర్చకుండా ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.

గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్‌తో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, విలీన గ్రామాలకు సంబంధించిన కేసులు కొట్టివేయబడడం స్వాగతించదగ్గ పరిణామమని అన్నారు. అయితే ఎస్. అచ్చుతాపురం, టీచర్స్ కాలనీ పరిధిలోని 42, 48 డివిజన్లు, అలాగే తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట గ్రామాలను ఎన్నికల ప్రక్రియలో భాగం చేయకపోవడం విచారకరమన్నారు.

పౌర సంక్షేమ సంఘం మొదటి నుంచే ఆరు విలీన గ్రామాలను కార్పొరేషన్‌లో కలిపి, 42, 48 డివిజన్లతో కలిసి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ చేస్తోందని రమణరాజు గుర్తు చేశారు. దీనికి సంబంధించి కొందరు కోర్టును ఆశ్రయించినప్పటికీ, గతంలో 2017లో జరిగిన తరహాలో సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించి డిసెంబర్ 2లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. అయితే హైకోర్టు విలీన వ్యతిరేక కేసులను కొట్టివేసిన అనంతరం స్థానిక అధికారులు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. సాధారణంగా సుమారు 20 రోజులు పట్టే బైఫర్కేషన్ ప్రక్రియను ఒక్క రోజులో పూర్తిచేసి, తుఫాను ప్రభావిత పరిస్థితుల్లో కేవలం 66 డివిజన్లకే పరిమితం చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు.

42, 48 డివిజన్లను కాకినాడ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని పెద్దపాటి సుబ్రహ్మణ్యం హైకోర్టులో దాఖలు చేసిన కేసు తీర్పు నవంబర్ 2న రావాల్సి ఉండగా, అది నవంబర్ 16కు వాయిదా పడిందని తెలిపారు. ఈ పరిణామం వెనుక అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మక్కై కుట్ర చేశారని, కేసును వాదించిన న్యాయవాది కోర్టుకు హాజరుకాకుండా చేసిన ప్రయత్నాలపై ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. ఇలాంటి చీకటి ఒప్పందాలు కాకినాడ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే భవిష్యత్తులో విలీన గ్రామాలు కాకినాడ నగర పరిధిలోకి రావడం ద్వారా నగరం “గ్రేటర్ కాకినాడ”గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని రమణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలపై ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని వాస్తవాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

ఎనిమిది ప్రాంతాల్లో సుమారు రెండు లక్షల జనాభా ఉండగా, దాదాపు 1.60 లక్షల మందికి ఓటు హక్కు లేకుండా పరిపాలనలో భాగస్వామ్యం కల్పించకపోవడం బాధాకరమన్నారు. పౌర సౌకర్యాల కల్పన కోసం పౌర సంక్షేమ సంఘం తమ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని, ఆరు లక్షలకు పైగా ప్రజల తరఫున నిరంతరం పోరాడుతామని దూసర్లపూడి రమణరాజు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో చింతపల్లి అజయ్ కుమార్, పెద్దింశెట్టి రామకృష్ణారావు, అంబటి రామకృష్ణ, జుత్తుక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :