లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎంఐఎం (AIMIM), ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) కలిసి సంయుక్తంగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించాయి.
లక్నోలో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ కూటమిపై అధికారిక ప్రకటన చేశారు. తమ కూటమికి “సామాజిక్ పరివర్తన్ మోర్చా” అనే పేరు పెట్టినట్లు నేతలు వెల్లడించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదించారు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో తమ కూటమి అభ్యర్థులను పోటీకి దింపుతామని నేతలు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని కూటమి నేతలు తెలిపారు. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
దళితులు, ముస్లింలు, ఇతర వెనుకబడిన వర్గాల హక్కుల కోసం తమ కూటమి పనిచేస్తుందని చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడితే 12వ తరగతి వరకు ఉచిత విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.
ఇండియా కూటమిలో చేరకపోవడానికి సీట్ల పంపకాల్లో వచ్చిన విభేదాలే కారణమని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. భవిష్యత్తులో తమ భావజాలానికి దగ్గరగా ఉన్న ఇతర పార్టీలను కూడా సామాజిక్ పరివర్తన్ మోర్చాలోకి ఆహ్వానిస్తామని చెప్పారు.
ఈ కొత్త రాజకీయ కూటమి ప్రకటనతో 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది.








