మెదక్ జిల్లా – తూప్రాన్ : మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ పట్టణంలోని గీతా జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం నుంచి న్యూఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టిన విజయలక్ష్మి పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆమె చేపట్టిన సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు తెలిపారు.
గీతా జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా కుటుంబ, సామాజిక జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వివరించారు.
యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకునేందుకు మంచి ఆలోచనలు, మంచి అలవాట్లతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా సూచించారు.








