తాడేపల్లి: ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) తో బాధపడుతున్న ప్రొద్దుటూరుకు చెందిన ఏడాదిన్నర వయసున్న బాలుడు వర్షిత్‌కు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. చిన్నారి చికిత్స కోసం పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాలుడి తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ్, బాల లింగమ్మ, పార్టీ నాయకుడు పి. నర్సింహారెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా చిన్నారి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు అవసరమైన ఖర్చుల వివరాలను ఆయన జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
రెండేళ్ల వయసు దాటకముందే చిన్నారికి మలేషియాలో ప్రత్యేక ఇంజెక్షన్ అందించాల్సి ఉందని, ఇందుకు సుమారు రూ.1.40 కోట్ల వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఇప్పటికే దాతల సహకారంతో రూ.50 లక్షల వరకు సమకూరినట్లు వివరించారు.
చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడిన వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పి, బాలుడి చికిత్సకు పార్టీ తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, చిన్నారి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు.
ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచేందుకు తాము ముందుకు వచ్చామని ఆయన చెప్పారు. హైదరాబాద్ వైద్యులతో పాటు మలేషియా వైద్యులను సంప్రదించి చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
చిన్నారికి అవసరమైన ప్రత్యేక చికిత్స కోసం అపాయింట్మెంట్, పాస్‌పోర్టు తదితర ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాచమల్లు వెల్లడించారు. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారి వర్షిత్‌కు మలేషియాలో ఇంజెక్షన్ అందించేలా వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
చిన్నారి మెరుగైన చికిత్స పొంది ఆరోగ్యంగా ఎదగడమే తమ లక్ష్యమని రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు.








