జగిత్యాల జిల్లా, మెట్పల్లి: పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన 82 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే సంజయ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు.
మెట్పల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాలకు సొంత ఇల్లు ఉండటం జీవితంలో ఒక పెద్ద కల అని, ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో లబ్ధిదారులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇళ్ల మంజూరు పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా పేదలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఎంపీడీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.








